From tea-seller to student, KTR Tweet

కేటీఆర్ ట్విట్టర్‌‌లో ఎప్పటికప్పుడు ప్రజాసమస్యలపై స్పందిస్తూ, వాటి పరిష్కారానికి ప్రయత్నిస్తుంటారు. చాలామంది తమ సమస్యలను మంత్రి కేటీఆర్‌కు ట్వీట్స్ రూపంలో విన్నవించుకుంటారు. గత డిసెంబర్‌లో రియాజుద్దీన్ అనే వ్యక్తి షమీ అనే 15ఏళ్ల బాలుడి గురించి కేటీఆర్‌కు ట్వీట్ (KTR Tweet) చేశాడు. షమీ కుటుంబానికి చదివించే స్థోమత లేకపోవడంతో అతని చదువు అర్థాంతరంగా నిలిచిపోయిందని, దీంతో బంజారాహిల్స్‌ రోడ్ నెం.10లోని సిటీ సెంట్రల్‌మాల్‌లో షమీ టీ అమ్ముతున్నాడని మంత్రి కేటీఆర్‌కు రియాజుద్దీన్ ట్వీట్ చేశాడు. ఆ బాలుడి పరిస్థితి చూసి మంత్రి కేటీఆర్ చలించిపోయారు. ఆ బాలుడిని స్కూల్‌లో చేర్పిస్తామని, తన ఆఫీస్ సిబ్బంది త్వరలో ఆ కుటుంబాన్ని కలుస్తారని కేటీఆర్ ట్వీట్ చేశారు. మంత్రి ట్వీట్ చేసిన అదే రోజు ఆయన ఆఫీస్ సిబ్బంది ఫోన్ చేశారని.. తన కొడుకు గురించి వివరాలు అడిగారని షమీ తండ్రి అజీజ్ చెప్పాడు. ఆసిఫ్ నగర్‌లోని మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్లో ఒక్క రూపాయి కట్టాల్సిన అవసరం లేకుండా షమీ చదువుకుంటున్నాడు. ఈ విషయంపై మాట్లాడుతూ షమీ తల్లి ఫర్హీన్ ఉద్వేగానికి లోనైంది.  తాము ఒక్క రూపాయి కూడా స్కూల్ ఫీజుగా కట్టలేదని, అన్నీ వాళ్లే చూసుకున్నారని, యూనిఫామ్, బుక్స్, బ్యాగ్, షూస్ అన్నీ వాళ్లే ఇచ్చారని ఫర్హీన్ చెప్పింది. జనవరి 1న షమీ స్కూల్‌లో చేరాడు. జనవరి 5న షమీకి అనారోగ్యంగా ఉండటంతో ఇంటికి తీసుకొచ్చామని, సంక్రాంతి సెలవుల అనంతరం తిరిగి స్కూల్‌కు పంపిస్తామని ఆమె తెలిపింది. తన పరిస్థితిని చూసి స్పందించిన కేటీఆర్‌‌కు షమీ, అతని కుటుంబం ధన్యవాదాలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Show Buttons
Hide Buttons